రాజమౌళి స్పందిస్తాడా.. లేదా..?

Update: 2025-11-22 12:01 GMT

దర్శక దిగ్గజం, సినీ ఇండస్ట్రీని ఏలుతున్న తిరుగులేని డైరెక్టర్ తీవ్ర వివాదంలో మునిగిపోయాడు. చరిత్రలో ఎన్నడు ఆయన ఇలాంటి ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోలేదు. ఇప్పటికే ఆయన ఎవరు మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆయనే ఎస్.ఎస్ రాజమౌళి. వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన కామెంట్లు చిలికి చిలికి గాలి దుమారంలా మారాయి. ఒకరిని చూసి ఒకరు రాజమౌళిపై వీడియోలు రిలీజ్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజమౌళి దేవుడిపై సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు కానీ అదే దేవుడిని అవమానిస్తూ మాట్లాడుతాడు అంటూ ఏకిపారేస్తున్నారు.

ఇప్పటికీ రాజమౌళిపై మూడు కేసులు నమోదయ్యాయి. హిందూ సంఘాలు, బిజెపి లీడర్లు రాజమౌళిని టార్గెట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఆయన సినిమాలను బ్యాన్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. రాజమౌళి స్పందించి వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. రాజమౌళి గతంలో త్రిబుల్ ఆర్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ తాను నాస్తికుడిని అని, దేవుడంటే పెద్దగా నమ్మకం లేదని, రాముడు బోరింగ్ క్యారెక్టర్ అంటూ చేసిన కామెంట్లను ఇప్పుడు మరోసారి తెరమీదకు తెస్తూ మరింత వివాదం రాజేస్తున్నారు.

మరి ఇంత జరుగుతున్నా సరే రాజమౌళి కనీసం స్పందించట్లేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఇది జాతీయ స్థాయిలో పెద్ద వివాదం అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే రాజమౌళి మామూలు వ్యక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోస్ట్ ఫేమస్ డైరెక్టర్. దేశవ్యాప్తంగా ఆయన సినిమాలకు భారీ అభిమానులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా ఆయన మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఆలస్యం చేస్తే రాజమౌళికే పెద్ద నష్టం. కాబట్టి ఈ వివాదం మీద స్పందించి ఏదో ఒక క్లారిటీ ఇస్తే అయిపోతుందని అంటున్నారు రాజమౌళి అభిమానులు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.


Full View

Tags:    

Similar News