Pa. Ranjith : స్టంట్ మేన్ మృతి - డైరెక్టర్ పై కేస్

Update: 2025-07-15 09:35 GMT

యాక్షన్ కొరియోగ్రఫీ అంత సులువైన క్రాఫ్ట్ కాదు. ఓ రకంగా ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అందుకే చాలా చాలా జాగ్రత్తలు తీసుకునే స్టంట్స్ చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ ప్రమాదం తమిళ దర్శకుడు పా. రంజిత్ మూవీ చిత్రీకరణలో జరిగింది. సీనియర్ స్టంట్ మేన్ ఎస్ఎమ్ రాజు (52) మరణించాడు. ఓ కార్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా.. కార్ డ్రైవింగ్ సీట్లో ఉన్న రాజు డ్రైవ్ చేస్తున్ను కార్ అదుపుతప్పి పడిపోయింది. రాజు ఆ కార్ లోనే మరణించాడు. ఈ విషాదం ఈ నెల 13న జరిగింది. మూవీ యూనిట్ వెంటనే రియాక్ట్ అయినా అప్పటికే ఆ స్టంట్ మేన్ మరణించాడు. ఈ కేస్ లో దర్శకుడు పా. రంజిత్, స్టంట్ కొరియోగ్రాఫర్ రాజ్ కాలమ్ తో పాటు నీలమ్ ప్రొడక్షన్స్ కు చెందిన ప్రభాకరణ్ పై మొదటి భారతీయ న్యాయ సంహిత్ చట్టం 194 కింద కేస్ నమోదు చేశారు.

అయితే పోస్ట్ మార్టమ్ తర్వాత సెక్షన్స్ లో మార్పులు చేశారు పోలీస్ లు.. బి.ఎన్.ఎస్ యాక్ట్ 289, 106 సెక్షన్స్ కింద కేస్ లు నమోదు చేశారు. వీటి ప్రకారం నిందితులకు పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరణించిన ఎస్ఎమ్ రాజు పూర్తి పేరు మోహన్ రాజు. చాలా యేళ్లుగా సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన అనుభవం ఉన్నవాడు. ముఖ్యంగా వెహికిల్ స్టంట్స్ కు రాజు పెట్టింది పేరు అంటారు. చాలా మంది సీనియర్ హీరోల సినిమాల్లో అతను చేసిన స్టంట్స్ హైలెట్ గా నిలిచాయి. కానీ అదే స్టంట్ తో అతను ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటాం అని దర్శకుడు, నిర్మాత కూడా అయిన పా. రంజిత్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అదే సమయంలో ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేసే టైమ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అన్నీ తీసుకున్నామని.. జాగ్రత్తల పరంగా ఎక్కడా పొరపాటు చేయలేదని, జరిగిన ఘటన దురదృష్టకరం అని చెప్పాడు. మరి ఈ కేస్ నిలబడుతుందా లేదా అనేది చూడాలి.

వెట్టువన్ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. ఆర్య ఆల్రెడీ రంజిత్ డైరెక్షన్ లో చేసిన సార్పట్టై పరంపర అనే చిత్రం చేశాడు. అది పెద్ద విజయం సాధించడంతో ఈ వెట్టువన్ పై భారీ అంచనాలున్నాయి. ఈ టైమ్ లో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.

 

Tags:    

Similar News