తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన అంశాలతో తాను ఏకీభవిస్తున్నానని చెబుతూ సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన స్పందనను వ్యక్తం చేశాడు.దీంతో పాటు తను కొన్ని ప్రతిపాదనలు కూడా చేశాడు. దిల్ రాజు కూడా ఓ పెద్ద లెటర్ నే విడుదల చేశాడు. ఈ లెటర్ చూస్తే ఇప్పుడు పవన్ గురించి ఏది చెప్పినా ఇబ్బందే.. ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా ఉంది. తాత్కాలికంగా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలపై పవన్ ను అభినందిస్తే పోలా అన్నట్టు కనిపిస్తోందనేది మెజారిటీ అభిప్రాయం. నిజంగా ఈ లెటర్ చూస్తే చాలామంది అదే భావిస్తారు. మరి ఆ లెటర్ లో ఏముందో మక్కీకి మక్కీ చూస్తే అర్థం అవుతుంది. పవన్ ప్రతిపాదించిన అంశాలను సమర్థించడంతో పాటు దిల్ రాజు కూడా ఓటిటి సినిమా, పైరసీ గురించి ప్రతిపాదనలు కూడా చేశాడు.
ఓటిటి గురించి చూస్తే.. ‘థియేటర్స్ నుంచి ఓటిటికి సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ఆడియన్స్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఒక సినిమా ఎంత కాలానికి ఓటిటికి వెళ్లాలి అనే అంశంపై మనమందరం(పవన్ కళ్యాణ్ కూడా అనే ఉద్దేశ్యం కావొచ్చు) కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత..’ అన్నాడు.
పైరసీ విషయానికి వస్తే.. ‘ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మన ప్రేక్షకులను తిరిగి థియేటర్స్ కు రప్పించగలుగుతాము’ అన్నాడు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఆయనకే తెలియాలి. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు మద్ధతు తెలిపేది ఉంటే.. ఆయన పేరు ప్రస్తావించాడు. కానీ కొత్త ప్రతిపాదనలు ఛాంబర్ ను ఉద్దేశించి అన్నాడా లేక యధాలాపంగా చెప్పాడో మరి.
వీటితో పాటు ఏపి ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసి కట్టుగా తోడ్డడుతాం.. అన్నాడు. అదీ మేటర్.