తమిళనాడుకు చెందిన ప్రముఖ నటులు శరత్ కుమార్, రాధిక దంపతులు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీని ( PM Modi ) కలిశారు. తమ కుమార్తె, నటి వరలక్ష్మి వివాహానికి వారు ప్రధానిని ఆహ్వానించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా టికెట్పై రాధిక పోటీ చేసింది. ఈ సందర్భంగా వారి మధ్య తమిళ రాజకీయాలు ప్రస్తావన కొచ్చాయి. తాను ఎన్నికల్లో చాలా బాగా పోరాడానని ప్రధాని మోదీ అన్నారని.. మరింత చురుగ్గా ఉండాలని సూచించారని రాధిక తెలిపింది.
2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పనిచేయడం మొదలుపెట్టాలని చెప్పారు అంటూ రాధిక ఓ జాతీయ మీడియా సంస్థతో వెల్లడించారు. తమిళ నాడు ప్రజల కోసం చేయగలిగినదంతా చేస్తామని తామిద్దరం మోదీకి ప్రామిస్ చేశామని శరత్ కుమార్ తెలిపారు. 2006లో రాధిక రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్ కుమార్ తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది అగ్ర నాయకత్వం వారిని తొలగించింది. 2007లో వారు ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.