పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరిహరవీరమల్లు. సినిమా మధ్యలో రెండు భాగాలుగా ఉంటుందని చెప్పారు. ఫస్ట్ పార్ట్ గా ‘స్వార్డ్ అండ్ స్పిరిట్’ అనే క్యాప్షన్ యాడ్ చేశారు. బట్ సెకండ్ పార్ట్ వస్తుందనే నమ్మకం మాత్రం ఎవరికీ లేదు. ఇక ఆరంభం నుంచీ ఈ సినిమా షూటింగ్ లే వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్స్ వేయడం.. మళ్లీ పోస్ట్ పోన్ అనేయడం కామన్ అయిపోయింది. లాస్ట్ డేట్ గా మే 9 అన్నారు. అంతకు ముందు దర్శకుడు క్రిష్ సగం షూటింగ్ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. చివరగా ఆ మధ్య ఓ ఫైవ్ డేస్ పవన్ డేట్స్ ఇస్తే అయిపోతుంది అని చెప్పారు. ఆయన ఇచ్చాడు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది.
ఇక ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయట. అందుకే ఈ సారి డేట్ ఎట్టిపరిస్థితుల్లోనూ మారదు అంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఆ టైమ్ లో రిలీజ్ డేట్ వేసిన కొన్ని సినిమాలు తప్పుకుంటున్నాయిప్పుడు. దీంతో మే 9న హరిహర వీరమల్లు ధర్మయుద్ధం తప్పదు అనుకోవచ్చు. త్వరలోనే మరో పాట, టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది టీమ్. ఇకపై వరుస అప్డేట్స్ తో ప్రమోషనల్ గానూ చొచ్చుకుపోవడానికి చూస్తున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా ఈ సినిమాను ఓన్ చేసుకోలేకపోతున్నారు. వారి దృష్టంతా ఎంత సేపూ ఓ.జిపైనే ఉంది. అది దాటి కాస్త ఇటువైపు వస్తేనే మూవీకి బజ్ క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు.
పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, సత్యరాజ్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, విక్రమ్ జీత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.