తప్పు చేసింది నేను.. నా ఫ్యామిలీని వదిలేయండి.. అంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ లో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రల్లో ఫూలే అనే చిత్రం రూపొందింది. ఇందులో ఫూలేగా ప్రతీక్, సావిత్రిబాయిగా పత్రలేఖ నటించారు. అయితే ఈ చిత్రాన్ని సెన్సార్ కాకుండా ఆపుతున్నారు కొందరు. దీంతో మూవీ టీమ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ నుంచి వారికి ఎలాంటి మద్దతు రావడం లేదని వాపోయింది. ఈ టైమ్ లో దర్శకుడు అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డ్ పై మండి పడ్డాడు. ఒక వర్గం వారు కావాలనే ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్నారని.. సినిమా విడుదలైతే వారి భండారం బయటపడుతుంది అన్నట్టుగా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వర్గం వారు ఇప్పుడు అనురాగ్ కశ్యప్ టార్గెట్ గా సోషల్ మీడియాలో బూతులు మొదలుపెట్టారు. అతని కుటుంబాన్ని ఇందులోకి లాగారు. అతని కూతురుపై అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతున్నారు.
దీనికి అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అయ్యాడు. ‘తప్పు చేసింది నేను. కావాలంటే నా గురించి ఏదైనా రాసుకోండి.. అనుకోండి. నా ఫ్యామిలీని మాత్రం వదిలేయండి అంటున్నాడు. అదే సమయంలో తన మాటలు ఒక వర్గం వారిని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణ చెబుతున్నాను కానీ.. ఆ మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోను’.. అని తేల్చి చెప్పాడు. మరి కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, బస్తర్ లాంటి సినిమాలకు లేని ఇబ్బంది ఫూలే చిత్రానికి మాత్రమే రావడం ఏంటో సెన్సార్ వారకే తెలియాలి.