Senior Actor Naresh: చిరంజీవి గారు కలిసారు.. 'మా'కు అవసరం లేదు.. : నరేష్
Senior Actor Naresh: 'మా' సభ్యుల సంక్షేమం కోసం తాను నిరంతరం కష్టపడతానని అన్నారు.;
Senior Actor Naresh: 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కేవలం ఇండస్ట్రీలోని సభ్యుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ.. పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, వివాదాలతో సంస్థకు ఎటువంటి సంబంధం లేదు అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. జనవరి 20వ తేదీన తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రమేశ్ బాబును కోల్పోవడం, కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తాను ఈసారి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని తెలిపారు. 'మా' సభ్యుల సంక్షేమం కోసం తాను నిరంతరం కష్టపడతానని అన్నారు.
'పండంటి కాపురం'తో చిత్ర రంగ ప్రవేశం చేశానని చెప్పారు. 50 సంవత్సరాల తన సినీ ప్రయాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా కృష్ణగారికి, తల్లి విజయనిర్మలకు, గురువు జంధ్యాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. నటుడిగా కొనసాగుతూనే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు. భాజపాతో కలిసి ప్రయాణం చేసి ఉన్నత పదవులు అలంకరించినా 'మా'కు తన వంతు బాధ్యత నిర్వర్తించానని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు సినీ పరిశ్రమలో అర్హులైన వారికి అందేలా చూస్తానని తెలిపారు.
తనకు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మరికొన్ని కొత్త పాత్రలతో పాటు, వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లు తెలిపారు. 'మా'కు ఒకసారే అధ్యక్షుడిగా పోటీచేస్తానని గతంలో చెప్పా.. ఒకవేళ భవిష్యత్తులో పోటీ చేసినా ఇండస్ట్రీ బిడ్డగా 'మా' సభ్యులకు సహకారం అందిస్తానని అన్నారు.
సినీ పరిశ్రమలో కూడా ఇతర రంగాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా సమస్యలు ఉంటాయని అన్నారు. దీనిపై పెద్దలందరూ కలిసి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఈ వివాదంలోకి తాను వెళ్లదలుచుకోలేదని అన్నారు. ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి ఒక మంచి నిర్ణయానికి వస్తారని అనునుకుంటున్నానన్నారు. ఇటీవల చిరంజీవిగారు సీఎం జగన్‌ని కలిశారు. ఈ విషయంలో 'మా' స్పందించాల్సిన అవసరం లేదు. 'మా' ఛాంబర్‌లో ఒక భాగం మాత్రమే. 'మా'కు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని నా అభిప్రాయం అని ఈ సందర్భంగా నరేష్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.