ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమాలు ఫ్లాప్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో దాదాపు ప్రతి హీరోకూ అనుభవమే. అయితే కెరీర్ ఇప్పుడే గాడిలో పడింది.. ఇమేజ్ వచ్చింది.. క్రేజ్ పెరుగుతోంది అనుకుంటోన్న టైమ్ లో డిజాస్టర్ పడితే మాత్రం అది తట్టుకోలేని బాధగా మారుతుంది. ఆ బాధలోనూ పెద్ద మనసు చాటుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన సిద్ధు రీసెంట్ గా ‘జాక్’ మూవీతో వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. అయితే చాలా క్రేజీ ప్రాజెక్ట్ అనిపించుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా తేలింది. సిద్ధుకు కూడా తన క్యారెక్టర్స్ పరంగా ఓ వార్నింగ్ బెల్ లా నిలిచింది.
సినిమా డిజాస్టర్ కావడంతో నిర్మాత కూడా ఇబ్బంది పడుతున్నాడు. అది తెలిసే సిద్ధు తన రెమ్యూనేరషన్ నుంచి 4 కోట్లు వెనక్కి ఇచ్చాడు. నిజంగా ఇది ఓ మంచి నిర్ణయం అనే చెప్పాలి. పైగా ఇలాంటి యంగ్ స్టర్స్ అలా చేయడం వల్ల కొత్త నిర్మాతలకు కూడా కొంత ధైర్యం వస్తుంది. కాకపోతే కంటెంట్ విషయంలో అందరూ కలిసి ముందే సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ తప్పిదాలు జరగవు. అప్పుడు ఎవరూ ఎవరికీ ఏ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.