Thalapathi Vijay : విజయ్ ని కలిశాక.. నన్ను కాల్చినా సంతోషమే

Update: 2025-05-07 08:45 GMT

అభిమానం వెర్రితలలు వేయడం అంటే ఇదేనేమో. తమ అభిమాన హీరోను కలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఏదైనా చేస్తారు. ఈ క్రమంలో బౌన్సర్స్ తో దెబ్బలు తిన్న సందర్భాలూ, పోలీస్ ల లాఠీకి ఒళ్లప్పగించిన సందర్భాలూ భాషతో సంబంధం లేకుండా చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళ టాప్ హీరో విజయ్ ని కలిసేందుకు ఓ అభిమాని ప్రయత్నం చేశాడు. అతను సెక్యూరిటీని దాటుకుని విజయ్ కి అత్యంత దగ్గరగా వచ్చాడు. ఆ క్రమంలో ఓ సెక్యూరిటీ పర్సన్ అతనివైపు తుపాకీ గురిపెట్టాడు. ఇదంతా కాసేపు కలకలం సృష్టించింది. మామూలుగా విజయ్ హీరోగానే ఉంటే బౌన్సర్స్ మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడతను పొలిటికల్ పార్టీ కూడా స్థాపించాడు కాబట్టి ఇలా గన్స్ తో కూడిన సెక్యూరిటీ కూడా వచ్చింది. అందుకే వచ్చింది కేవలం అభిమాని మాత్రమేనా ఇంకెవరైనా దుండగుడా అనే కన్ఫ్యూజన్ లో అతను తుపాకి తీసి ఉంటాడు. కానీ అతన్నేం చేయలేదు. అయితే ఈ తతంగాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు విజయ్.

తర్వాత ఆ వచ్చిన వ్యక్తిని తుపాకి గురించి అడిగారు. ‘నాకు గన్ గురి పెట్టింది.. విజయ్ ని కాపాడటానికే. ఒకవేళ ఆ క్రమంలో నన్ను కాల్చి చంపివేసినా నాకు సంతోషమే. అది నా దళపతి కోసం ఇచ్చిన ప్రాణంగా భావిస్తాను’ అని చెప్పడం గమనార్హం.

మొత్తంగా ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ ఘటన నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. ఇక అభిమానికి గన్ గురిపెట్టడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ ఎలాగూ రెచ్చిపోతారు. కానీ ఇదంతా కేవలం ప్రాటెక్షన్ లో భాగంగా జరిగిందే తప్ప.. అతన్ని కాల్చి వేయాలనే ఆలోచన అక్కడ ఎవరికీ ఉండదు అనుకోవచ్చు.

Tags:    

Similar News