Vaibhav Reddy : వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ ది హంటర్ చాప్టర్- 1

Update: 2025-12-04 09:05 GMT

టాలెంటెడ్ హీరో వైభవ్ రెడ్డి లీడ్ రోల్‌లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ది హంటర్ చాప్టర్- 1. రణం అరం తవరేల్ అనే తమిళ సినిమాను తెలుగులో ది హంటర్ చాప్టర్- 1 అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు షెరీఫ్ రచన, దర్శకత్వం వహించగా.. వైభవ్ రెడ్డి, నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. అర్రోల్ కొరెల్లి సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీని బాలాజీ కె రాజా చేపట్టారు. ఈ ఏడాది జూన్ నెలలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వడమే గాక, అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. సస్పెన్స్, థ్రిల్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం ఓ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందించింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఉత్కంఠభరితమైన కథనం, హృదయాన్ని కదిలించే సస్పెన్స్ మాత్రమే కాకుండా వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో థియేటర్స్‌లో సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో కూడా అదే హవా నడిపిస్తోంది. ఈ కథలో ఆది అనే దృఢసంకల్పం కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు వైభవ్ రెడ్డి. అతని గతంలో కొన్ని రహస్యాలు దాగి ఉంటాయి. ఈ పరిస్థితుల నడుమ వరుస హింసాత్మక సంఘటనలు నగరాన్ని కుదిపేస్తాయి. ఈ పరిణామాల్లో అనుకోకుండా అతను తప్పించుకోలేని చేజ్‌లో చిక్కుకుంటాడు. ఆపై ఈ కథ మొత్తం ప్రమాదం, రహస్యాలు, నైతిక సంఘర్షణలతో నిండిన ఉత్కంఠభరితమైన ఛేజ్ చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమాలో వైభవ్ ఆకట్టుకునే నటన కనబర్చగా.. నందితా శ్వేత ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకుంది. అలాగే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. తాన్యా హోప్ ప్రభావవంతమైన పాత్రతో ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో తన మార్క్ చూపించింది. 121 నిమిషాల ఈ మూవీ థ్రిల్లర్, క్రైమ్ జానర్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికీ పర్ఫెక్ట్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అనుభూతి ఇస్తుందని చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News