ఫ్రైడే వచ్చిందంటే చాలు కొత్త సినిమా పోస్టర్స్ తో థియేటర్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. కానీ కొన్నాళ్లుగా అప్పుడప్పుడూ తప్ప నిజంగా కమర్షియల్ గా కళ తెచ్చుకుంటోన్న సినిమాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల్లో. లాస్ట్ వీక్ వచ్చిన కోర్ట్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. ఇక ఈ వారం విడుదలవుతున్న సినిమాలేంటీ అంటే ప్రధానంగా మూడు సినిమాలు కనిపిస్తున్నాయి కానీ అంతకంటే ఎక్కువే విడుదల కాబోతున్నాయి.
కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన పెళ్లికాని ప్రసాద్ ఈ శుక్రవారం విడుదలవుతోన్న సినిమాల్లో కాస్త పెద్దగా కనిపిస్తోంది. ఈ మూవీ కోసం అతను విపరీతమైన ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. అంతా తానై తిరుగుతున్నాడు. కంటెంట్ పై నమ్మకంతోనే ఇలా చేస్తున్నానని చెబుతున్నాడు.అతని సరసన ప్రియాంక హీరోయిన్ గా నటించింది. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన పెళ్లికాని ప్రసాద్ ను దిల్ రాజు విడుదల చేస్తుండటం విశేషం.
చిన్న కుర్రాళ్లే ప్రధాన పాత్రల్లో సుప్రీత్ సి కృష్ణ డైరెక్ట్ చేసిన టుక్ టుక్ శుక్రవారం విడుదలవుతోంది. కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, కార్తికేయా దేవా, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది.
ఆది సాయికుమార్ దండయాత్రలో భాగంగా వస్తోన్న మరో సినిమా షణ్ముఖ ఇదే రోజు విడుదలవుతోంది. అవికా గోర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కనీస ప్రచారం కూడా చేయలేదు. చాలామందికి అసలు ఈ మూవీ వస్తున్నట్టుగానే తెలియదు. వీటితో పాటు కాలమేగా కరిగింది, సస్పెక్ట్, ఓ అందాల రాక్షసి, కిల్లర్ ఆర్టిస్ట్, అనగనగా ఆస్ట్రేలియాలో వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి.
ఇవి కాక సలార్ రీ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా అదరగొట్టింది. ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి స్టూడెంట్స్ కోసం ఆఫర్ కూడా ప్రకటించింది మూవీ టీమ్. మొత్తంగా చూస్తే ఈ వారం ఏకంగా 10 సినిమాలు విడుదలవుతున్నాయి. చూస్తుంటే రీ రిలీజ్ లు తప్ప ఫస్ట్ రిలీజ్ లు సందడి చేసేలా ఏం కనిపించడం లేదు అనేలానే ఉన్నాయి.