కట్టప్పగా ఇండియన్ ఆడియన్స్ కు ఎప్పటికీ మరపురాని ముద్ర వేసిన సత్య రాజ్ కు తర్వాత ఆ స్థాయి పాత్రలు పడలేదు. అఫ్ కోర్స్ ఇలాంటి పాత్రలు లైఫ్ లో ఒక్కసారే పడతాయి. తర్వాత తనదైన శైలిలో తనకు నచ్చిన పాత్రలతో ముందుకు వెళుతున్నాడు సత్యరాజ్. ప్రస్తుతం తెలుగులో ఆయన నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’అనే సినిమా టీజర్ విడుదలైంది. దర్శకుడు మారుతి చేతుల మీదుగా ఈ టీజర్ ను విడుదల చేశారు. మామూలుగా ఈ టైటిల్ చూసే చాలామంది ఇంట్రెస్టింగ్ అనుకున్నారు. టీజర్ చూస్తే ఓ బలమైన కథను చెప్పబోతున్నారు అనిపిస్తోంది.
టీజర్ ఆరంభం నుంచే మిస్టీరియస్ గా కనిపించింది. అమ్మాయిలను హత్యలు చేస్తోన్న వ్యక్తిని అతని వల్ల బాధింపపడిన పెద్దాయన.. తర్వాత తన పగను ఎలా తీర్చుకున్నాడు అనే కోణంలో ఈ సినిమా ఉండబోతోందనే అంచనాకు వచ్చేలా ఉంది టీజర్. కానీ అంత సింపుల్ గా ఫినిష్ చేస్తే ఎలా.. అందుకే టేకింగ్ పరంగా, మేకింగ్ పరంగా కొత్తగా ఉండేలా ఉంది. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ కనిపిస్తున్నాయి. భీష్మ శబదం, గరుడపురాణం, పాశుపతాస్త్రం, గాండీవధారి అర్జున, బ్రహ్మాస్త్రంల రిఫరెన్స్ తో నేపథ్యంలో రివెంజ్ డ్రామాలా ఉంది. అంటే ఆ పురాణాల్లో ఎలాగైతే పగ తీర్చుకుంటారో ఆ కోణంలో ప్రధాన పాత్ర ప్రవర్తిస్తుంది అనే హింట్ కనిపిస్తుంది. టీజర్ లోనే కొన్ని షాట్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ఆరంభం నుంచి ఆఖరు వరకూ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ టీజర్.
సత్యరాజ్ తో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచీ రాయ్, ఉదయభాను తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మోహన్ శ్రీవాత్సవ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాం అని టీజర్ తో చెప్పారు. మొత్తంగా ఈ టీజర్ బావుంది. కాకపోతే ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించే సత్తా ఉన్న ఆర్టిస్టులు లేరనే చెప్పాలి.