Super Star Krishna: మహా మనిషికి అక్షర నీరాజనం
Super Star Krishna: ఆకాశంలో ఒక తారగా చేరేందుకు దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడీ దేవుడు చేసిన మనిషి;
Super Star Krishna:
సూపర్ స్టార్ కృష్ణ ..
బహుముఖ ప్రజ్ఞాశాలి, అజాతశతృవు,
దేనికీ వెరవని ధీరుడు, క్రమశిక్షణకు మారుపేరు..
అన్నిటికీ మించి నిఖార్సైన వ్యక్తిత్వానికి సిసలైన చిరునామా..
తేనె మనసులుతో తనను పరిచయం చేసిన ఆదుర్తిని
గూఢచారి116తో తనను కమర్షియల్ గా నిలబెట్టిన డూండీని
ఆజన్మాంతం స్మరించుకున్న సంస్కారి
తెలుగు సినిమా కీర్తి కిరీటంలో ఎన్నో మేలిమి ఆభరణాలద్దిన సాహసి
మోసగాళ్లకు మోసగాడుగా చేసిన సాహసం
తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచే కీర్తి పతాకం
తెలుగు సినిమా సాంకేతికంగా సరికొత్త అనుభూతి పొందిన
అనేక "తొలి" మార్పులకు నాంది పలికిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ ..
సాంఘిక, జానపద, పౌరాణిక, జేమ్స్‌బాండ్, కౌబాయ్ ..
జానర్ ఏదైనా అది సూపర్ స్టార్ చేస్తే జయం మనదే అనేశారు ఆడియన్స్
కొత్త నిర్మాతలను ప్రోత్సహించడంలో
నష్టపోయిన నిర్మాతలను ఆదుకోవడంలో అతనికంటే ఘనుడు లేడు
లెక్కలేనన్ని హ్యాట్రిక్ విజయాలు,
అపజయాలూ ఉన్నా.. ఏనాడూ ప్రేక్షకుల ఆదరణ తగ్గని అరుదైన నటుడు
కథాంశం ఏదైనా ఆ కటౌట్ లోకి ఒదిగిపోవడం ఆయన స్టైల్..
ఊరికి మొనగాడైనా, మాయదారి మల్లిగాడైనా..
ఘరానా దొంగలా మైమరపించి, బెబ్బులిలా గాండ్రించినా
ఊరంతా సంక్రాంతిని నింపగల సిరిపురం మొనగాడు
రూధర్‌ఫర్డ్.. ఈ గాలిలో గాలినై.. మట్టిలో మట్టినై
అంటూ అల్లూరి సీతారామ రాజులా తీవ్రమైన స్వరంతో డైలాగులు
చెబుతుంటే.. ఆ తీవ్రతకు ఆడియన్స్ చలించిపోయారు.
బాక్సాఫీస్ షేక్ అయింది.. రికార్డులు బద్ధలయ్యాయి..
బాక్సాఫీస్ యుద్ధంలో పోరాటయోధుడులా శక్తిని నింపుకుని
రికార్డుల అగ్నిపర్వాతాలను సైతం బద్ధలు కొట్టగల మహా మనిషి
మా వూరు మొనగాడు అని ప్రతి వూరూ అనుకున్న ముద్దుబిడ్డ
సినీ, రాజకీయ కురుక్షేత్రంలో మండలాధీశుడులా మెరిసినా..
అజాతశతృవు అనిపించుకున్న కృష్ణావతారం ఆయనది..
కెరీర్ థర్డ్ ఇన్నింగ్స్ లోనూ నెంబర్ వన్ అనిపించుకుని
ఇరత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన జగదేకవీరుడు ఈ సూపర్ స్టారు
శ్రీశ్రీగా చివరిగా అలరించి..
చిరకాల కీర్తిని సంపాదించుకుని
అయిన వారికీ, అభిమానులకు తీరని దు:ఖాన్ని మిగిల్చి
ఆకాశంలో ఒక తారగా చేరేందుకు దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడీ దేవుడు చేసిన మనిషి
తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం ముగిసిపోయినా..
తెలుగు సినిమా సాహస సింహాసనానికి శాశ్వత చక్రవర్తిగా వెలిగిన
ఈ కళామతల్లి వారసుడి కథ ముగిసింది.. చరిత్ర కాదు..
బాబూరావు. కె