ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ( Varalaxmi Sarathkumar ), నికోలై సచ్‌దేవ్ ( Nicholai Sachdev ) జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. జులై 2న థాయ్‌లాండ్‌లో వివాహం జరగనుంది. శరత్‌కుమార్-రాధిక దంపతులు ఇప్పటికే వివాహ పనులు మొదలు పెట్టారట. తమిళనాడు సీఎం స్టాలిన్ సహా సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
పెళ్లికి ముందు మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమానికి చెన్నైలోనే జరుపుకోవాలని వరలక్ష్మి నిర్ణయించుకున్నారట. అయితే, పెళ్లి మాత్రం థాయ్‍లాండ్‍లో చేసుకోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే వివాహం కోసం థాయ్‍లాండ్‍లో ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం రాలేదు. కాగా, గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు పదేళ్ల పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమయ్యారు.
వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. లేడీ విలన్‌గా సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి మొదట హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసింది. నటుడు శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె 'పొడా పొడి' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించిన వరలక్ష్మి సహానటి పాత్రలు కూడా చేసింది. ఆ తర్వాత ఆమె ఆఫర్స్ తగ్గడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో 'తెనాలి రామకృష్ణ ఎల్‌ఎల్‌బీ' సినిమాతో లేడీ విలన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జాంబి రెడ్డి', 'నాంది', 'యశోద', 'వీరసింహా రెడ్డి' వంటి సినిమాల్లోనూ విలన్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్‌లో అక్క పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుంది.