విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విడుదల. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అప్పుడే సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని చెప్పారు. అది కాస్త ఆలస్యం అయినా.. ఈ నెల 20న విడుదల కాబోతోందీ విడుదల 2. తాజాగా ఈ పార్ట్ కు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. సెకండ్ పార్ట్ లో విజయ్ కి జోడీగా టాలెంటెడ్ లేడీ మంజు వారియర్ కూడా నటించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ సైతం సూపర్ హిట్ గా నిలిచాయి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది చూద్దాం.
‘ప్రాంతం, జాతి, భాష అని జనాల్ని ఒక్కటిగా చేసే పని మేం చేయడం మొదలుపెట్టినప్పుడు.. మీరు ఏర్పాటు చేసిన ఈ కులం, మతం, వేర్పాటు వాదం.. దేనితోనూ మీరు రాజకీయం చేయలేకపోయారు.. అప్పుడు మొదలైంది ఈ భయం.. ఆ భయంతోనే మమ్మల్ని వేర్పాటు వాదులుగా ప్రచారం చేస్తున్నారు.. హింస మా భాష కాదు.. కానీ మాకు ఆ భాష కూడా మాట్లాడ్డం వచ్చు..’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైందీ ట్రైలర్. ఈ క్రమంలో వచ్చే సీన్స్ అన్నీ చాలా ఇంటెన్సిటీతో ఉన్నాయి. ఫస్ట్ క్లైమాక్స్ లో పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని అరెస్ట్ చేస్తారు పోలీస్ లు. అయితే అసలు పెరుమాళ్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానమే ఈ చిత్రం. అతనెందుకు వేర్పాటు వాదిగా మారాడు. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటీ.. అనేది ఈ కథ.
ట్రైలర్ లో ‘ఇదుగో సూడూ.. మాలాంటి సదువురానివాడొకడు రైలుపట్టాలపై తలపెట్టడం వల్లే.. నీలాంటి వాడొకడు సదువుకుని ఇక్కడ కూకున్నాడు’ అనే డైలాగ్ చూస్తే ఈ పోరాటంలో ఉన్న సత్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ‘సిద్ధాంతం లేని నాయకులే అభిమానుల్ని సృష్టిస్తారు.. అది అభివృద్ధికి మార్గం కాదు’ అనే మరో పవర్ ఫుల్ డైలాగ్ ఆ ఉద్యమాలు ఎందుకు ఇంకా బలంగా మారలేకపోయాయో కూడా తెలుపుతుంది. ట్రైలర్ మొత్తం అద్భుతంగా ఉంది. వెట్రిమారన్ కే సాధ్యమయ్యే నెరేషన్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లు కనిపిస్తున్నాయి. అటు మంజు వారియర్ పాత్ర ఓ సర్ ప్రైజింగ్ అనిపిస్తోంది. ఇళయరాజా సంగీతం మరోసారి హైలెట్ కాబోతోందనిపిస్తోంది. మరోసారి వెట్రిమారన్ ఓ బలమైన కథ, కథనాలతో ఆడియన్స్ మెస్మరైజ్ చేయబోతున్నాడని ఈ ట్రైలర్ ప్రామిస్ చేసినట్టుగా ఉంది.
అయితే ఈ నెల 20న తెలుగులో చాలా సినిమాలున్నాయి. గట్టి పోటీ ఉంది. ఈ పోటీలో నిలబడి విడుదల 2ను ఇక్కడా రిలీజ్ చేస్తారా లేక తెలుగు కోసం కొంత గ్యాప్ తీసుకుంటరా అనేది చూడాలి.