Kingdom Review : విజయ్ దేవరకొండ కింగ్ డమ్ హిట్టా ఫట్టా..?

Update: 2025-07-31 08:16 GMT

రివ్యూ : కింగ్ డమ్

ఆర్టిస్ట్స్ : విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకిటేష్. వి.పి, అయ్యప్ప పి శర్మ, రోహిణి, భూమిశెట్టి, మనీష్ చౌధరి, బాబురాజ్ తదితరులు

ఎడిటర్ : నవీన్ నూలి

సినిమాటోగ్రాఫర్స్ : గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్

నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య

దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్ డమ్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. రిలీజ్ కు ముందు మరీ ఎక్కువ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైందీ మూవీ. ట్రైలర్ అంచనాలు పెంచింది. విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పైగా సితార బ్యానర్ సినిమా కాబట్టి ఆడియన్స్ కూడా మాగ్జిమం ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను కింగ్ డమ్ మూవీ రీచ్ అయిందా లేదా అనేది చూద్దాం.

కథ :

ఏపిలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ తెగ.. 1920ల కాలంలో బ్రిటీస్ వారి వల్ల శ్రీలంకకు వెళ్లి తలదాచుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో జరిగిన యుద్ధంలో వారి నాయకుడు చనిపోతాడు. మళ్లీ కొత్త నాయకుడు వస్తాడని ఎదురుచూస్తున్న వారిని శ్రీలంక ప్రభుత్వం గుర్తించదు. భారత్ కూడా పట్టించుకోదు. దీంతో అక్కడి కొందరు స్మగ్లర్ల చేతిలో చిక్కుకుని వారికి బానిసల్లా ఉంటారు. 1991 కాలంలో తెలంగాణలోని అంకాపూర్ లో ఓ కానిస్టేబుల్ సూరి(విజయ్ దేవరకొండ). చిన్నప్పుడే తప్పిపోయిన తన అన్న శివ(సత్యదేవ్) కోసం 18యేళ్లుగా గాలిస్తుంటాడు. ఆ క్రమంలో ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు అనుకోకుండా ఓ పోలీస్ ఆఫీసర్ ను కొడతాడు. అది పెద్ద సమస్య అవుతుంది. అయితే అతని ‘అవసరాన్ని’గుర్తించిన ఇంటిలిజెన్స్ డిపార్ట్ మెంట్.. శ్రీలంకలో ఓ ఆపరేషన్ చేయడానికి అతన్ని అండర్ కవర్ స్పై గా పంపించాలనుకుంటారు. తన అన్న దొరుకుతాడు అని సూరి ఒప్పుకుంటాడు. మరి సూరి శ్రీలంక వెళ్లి తన అన్నను కలుసుకున్నాడా..? అక్కవ శివ ఏం చేస్తున్నాడు. అసలు శ్రీలంక స్మగ్లర్స్ కోసం ఇండియన్ ఏజెంట్స్ ఎందుకు వెదుకుతుంటారు..? వారు ఎదురు చూస్తోన్న షిప్ లో ఏముందీ..? అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

కొన్ని కథలు టేకాఫ్ దశలోనే ఎలా ఉండబోతున్నాయో ఓ ఐడియా వస్తుంది. పైగా వీళ్లు ట్రైలర్ లోనే కథ చెప్పారు. కాబట్టి కథనంపైనే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. కింగ్ డమ్ ఆరంభం బావుంది. పాత్రల పరిచయం.. కాన్ ఫ్లిక్ట్ కు సంబంధించిన సన్నివేశాలు బావున్నాయి. సూరిలో ఓ స్పైకి ఉండాల్సిన లక్షణాలున్నాయని ఆఫీసర్స్ గుర్తించే సీన్స్ బావున్నాయి. అక్కడి నుంచి కథనం శ్రీలంకకు షిఫ్ట్ అవడం.. అక్కడ తన అన్నను జైలులో కలుసుకోవడం (ఇవన్నీ ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పారు కాబట్టి రివీల్ చేస్తున్నాం).. ఆ క్రమంలో వచ్చిన యాక్షన్ సీన్ హై మూమెంట్ ఇస్తుంది. ఆపై తన అన్న ఓ బానిసలా బందీగా ఉన్నాడని.. వారిని బానిసలుగా చూస్తున్న మురుగన్ (వెంకిటేష్) క్రూరత్వం గురించి తెలుసుకుంటాడు. సెకండ్ హాఫ్ మరింత ఇంటెన్సిటీతో సాగుతుందీ అని భావిస్తాం. కానీ అక్కడక్కడా డ్రా బ్యాక్స్ కనిపిస్తాయి. రైటింగ్ కొన్ని చోట్ల పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా విజయ్ పాత్రను ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉండాల్సింది. అలాగే భాగ్య శ్రీ పాత్ర ఎందుకు ఉందో కూడా అర్థం కాదు. ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి అనుకున్నారేమో కానీ.. ఆమె వల్ల సినిమాకు, సినిమా వల్ల ఆమెకు ఏ ఉపయోగం లేకుండా పోయింది. కనీసం లవ్ ట్రాక్ కూడా లేదీ సినిమాలో. క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ ఉంటుంది అని కానీ, ఉండదు అని కానీ చెప్పలేదు. అంటే ఈ మూవీ రిజల్ట్ ను బట్టి సెకండ్ పార్ట్ కు వెళతారేమో.

ఎవరెలా నటించారు :

విజయ్ దేవరకొండ సెటిల్డ్ గా ఉన్నాడు. సూరిగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. అందుకే అతను అన్న కోసం వెదుకుతున్న తమ్ముడుగానే కనిపిస్తాడు. చాలా అంటే చాలా బెటర్ అయ్యాడు నటన పరంగా. భాగ్యశ్రీ బోర్సేకు నటించడానికి ఏం లేదు. కాకపోతే తెరపై సింపుల్ గా చాలా అందంగా ఉంది. స్పై ఏజెంట్స్ చీఫ్ గా నటించిన మనీష్ చౌదరి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అందరికంటే ఎక్కువ ఆకట్టుకుంది మాత్రం సత్యదేవ్. ఆ పాత్రకు తగ్గ ఇంటెన్సిటీని అద్భుతంగా పండించాడు. సెకండ్ హాఫ్ లో ఓ పెద్ద సీన్ అతనిపై అదిరిపోయేలా రూపొందించాడు దర్శకుడు. విలన్ గా నటించిన వెంకిటేష్ బాగా చేశాడు. ఇతర పాత్రల్లో రాజ్ కసిరెడ్డి, మహేష్, భూమిశెట్టి, రవికృష్ణ, నవ్యస్వామి ఓకే.

టెక్నికల్ గా ఒక్క ఎడిటింగ్ తప్ప బ్రిలియంట్ గా ఉంది మూవీ. అనిరుధ్ తనవంతుగా ఆర్ఆర్ అదరగొట్టాడు. రగిలే పాట ఆల్రెడీ హిట్ అయింది. సినిమాలోనూ బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ సినిమాకు కావాల్సిన మూడ్ ను పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసింది. డైలాగ్స్ ఓకే. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ఒరిజినల్ లొకేషన్స్ కావడంతో నేచురల్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా కనిపిస్తాయి. ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు లేదు. దర్శకుడుగా గౌతమ్ తిన్ననూరి మళ్లీరావా, జెర్సీ మూవీస్ తో ఎమోషనల్ గా టచ్ చేశాడు. ఈ సారి యాక్షన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే రైటింగ్ పరంగా చాలా తబడాట్లు ఉన్నాయి. అవే సినిమా ఫ్లో ను దెబ్బ తీశాయి.

ఫైనల్ గా : విజయ్ దేవరకొండ కింగ్ డమ్

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల

Full View

Tags:    

Similar News