నాగ్ అశ్విన్ కు దర్శకుడుగా మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. నాని, మాళవిక నాయర్ జంటగా విజయ్ దేవరకొండ, రీతూ వర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయింది. కాసుల వేటలో పడి మనిషి తనను తాను కోల్పోతున్నాడనే అంశాన్ని తాత్వికంగా కాక వినోదాత్మకంగా చెప్పాడు దర్శకుడు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ విడుదలై పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 21న రీ రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం కోసం స్టూడెంట్స్ కు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఎవరైనా కొందరు విద్యార్థులు తమ ఐడి కార్డ్స్ తో గ్రూప్ బుకింగ్స్ చేసుకుంటే వారికి కేవలం 100 రూపాయలకే టికెట్ ఇచ్చేస్తారు. అంటే గ్రూప్ మొత్తానికి కాదు. ఒక్కో టికెట్ 100లే అన్నమాట. ఈ తరం కుర్రాళ్లకు కూడా ఎవడే సుబ్రహ్మణ్యం నచ్చుతుందని.. వారి హృదయాల్లో ఈ మూవీకీ ఓ ప్రత్యేక స్థానం ఏర్పడుతుందనే నమ్మకంతోనే ఇలా చేస్తున్నారు. అలాగే ఎవరైనా కాలేజ్ వాళ్లు కూడా సినిమా చూడాలనుకుంటే తమను సంప్రదించాలి అంటూ 9912632233 అనే నంబర్ ఈ అంశాన్ని తెలియజేసే పోస్టర్ లో యాడ్ చేశారు. మరి స్టూడెంట్స్ ప్రస్తుతం ఎగ్జామ్ మూడ్స్ లో ఉన్నారు. అయినా 100 లే అంటున్నారు కానీ గ్రూపులు గ్రూపులుగా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి వెళతారా లేదా అనేది చూద్దాం.