Lakshmi Menon : కిడ్నాప్ కేసులో సినీ నటి లక్ష్మీ మీనన్ - పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడి

Update: 2025-08-28 06:07 GMT

ప్రముఖ నటి లక్ష్మీ మీనన్ ఒక కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేరళలోని కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేశారన్న ఆరోపణలతో ఆమెతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొచ్చిలోని ఓ రెస్టారెంట్ బార్‌లో బాధితుడి స్నేహితుడితో లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ అనంతరం లక్ష్మీ మీనన్ బృందం బార్ నుంచి బయటకు వచ్చిన బాధితుడిని వెంబడించి, అతని కారును అడ్డగించింది. అనంతరం అతడిని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముగ్గురు నిందితులు అరెస్ట్

బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన ఎర్నాకులం నార్త్ పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి లక్ష్మీ మీనన్ స్నేహితులైన మిథున్, అనీశ్, సోనామోల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితురాలైన లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు.

'కుంకి', 'జిగర్తాండ', 'వేదాలం' వంటి విజయవంతమైన తమిళ చిత్రాలతో లక్ష్మీ మీనన్ గుర్తింపు పొందారు. అలాగే చంద్రముఖి 2, విశాల్ సరసన నటించిన 'ఇంద్రుడు' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. నటిగా మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం సినీ వర్గాల్లో కలకలం సృష్టించింది.

Tags:    

Similar News