Hyderabad : చాదర్ ఘాట్లో అమ్మాయిలను విక్రయిస్తుండగా బంగ్లా ముఠా పట్టివేత
హైదరాబాద్ లోని చాదర్ ఘాట్లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయ్యింది. విదేశాల నుంచి అమ్మాయిలను నగరానికి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్న ముఠా సభ్యులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, చాదర్ ఘాట్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. మూసానగర్ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించి బంగ్లాదేశ్ కు చెందిన ఈ ముఠాలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి మయన్మార్ నుంచి నలుగురు యువతులు, మరో నలుగురు బాలికలను హైదరాబాద్ కు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. వారిని ఒక గదిలో బంధించి అమ్మకాలు చేపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా సభ్యులు ఇప్పటివరకు ఎంత మందిని హైదరాబాద్ కు తరలించారు, వారిని ఎక్కడెక్కడ అమ్మకాలు జరిపారన్న కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.