విద్యుత్ శాఖ పేరుతో లింక్ పంపి 5,23,000 రూపాయలను స్వాహా చేసిన సైబర్ నేరగాళ్ల ఉదంతం మంచిర్యాల లో వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైటెక్ సిటీకి చెందిన ఎల్.ఐ సీ ఏజెంట్ రఘు మొబైల్ కు టీజీ ఎన్ పిడీసీఎల్ పేరుతో ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ను రఘు ఓపెన్ చేశాడు. అది గమనించిన సైబర్ నేరగాళ్లు రఘుకు ఫోన్ చేసి తాము విద్యుత్ శాఖ నుంచి మాట్లాడుతున్నామని ఎలక్ట్రిసిటీ బిల్ తనిఖీ చేస్తున్నామని ఫోన్ కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాలని కోరడంతో ఆయన ఓటీపీ పంపాడు. కొద్దీ సేపటి తరువాత రఘు అకౌంట్ నుండి 5,23,000/- రూపాయలు సైబర్ నేరగాడి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయాయి. రఘు తనకు జరిగిన సైబర్ మోసంపై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ళు రోజురోజుకి కొత్త తరహాలో జనాలను మోసం చేస్తూ టెక్నాలజీ ని ఉపయోగిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని సీఐ బన్సీలాల్ తెలిపారు. కావున ప్రజలు అపరచిత వ్యక్తులు పంపే మెసేజ్ లకు రెస్పాన్స్ ఇవ్వడం గాని లేదా వారు పంపే లింక్ లను ఓపెన్ చేయడం గాని చేయవద్దని సూచించారు.