పశ్చిమ గోదావరి జిల్లాలో వివాదాస్పదంగా మారిన ఏఈవో మృతి
వేధింపువల్లే ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయం AEO రామాచారి గుండెపోటుతో మృతిచెందినట్లు ఆలయ సిబ్బంది ఆందోళనకు దిగారు.;
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం AEO మృతి వివాదాస్పదమవుతోంది. వేధింపువల్లే ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయం AEO రామాచారి గుండెపోటుతో మృతిచెందినట్లు ఆలయ సిబ్బంది ఆందోళనకు దిగారు. స్వామివారి మండపం వద్ద నేలపై కూర్చొని నిరసన తెలుపారు. ఆలయ EO సుబ్బారెడ్డి..వ్యక్తిగతంగా కించపర్చటంతో రామాచారి తీవ్ర మనస్తాపంతో మృతి చెందినట్లు ఆరోపించారు. ఈవో సుబ్బారెడ్డి కిందిస్థాయి సిబ్బందిని తరుచుగా దూషించేవారన్నారు.
ఈవో సుబ్బారెడ్డి ద్వారక తిరుమల చిన్న వెంకన్నస్వామిని అవమానించారని ఆరోపించింది జనసేన. కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతినేలా... ఈవో సుబ్బారెడ్డి వ్యవహరించారని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శించారు. కరోనా నుంచి కోలుకున్నందుకు ఆలయ పరిసరాల్లో..... జంతుబలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోతిన మహేష్. విచారణాధికారి ఏఈవో రామాచారి జంతుబలిని నిర్ధారించినందునే...ఈవో సుబ్బారెడ్డి వేధించినట్లు ఆరోపించారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
AEO రామాచారి మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అటు ఆలయ ఉద్యోగులు ఇటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈవోపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.