ప్రియుడి మాట విన్న ఓ కన్నతల్లి దారుణానికి ఒడిగట్టింది. తన మూడేళ్ల చిన్నారిని నిద్రలో ఉండగా సరస్సులో పడేసి చంపేసింది. ఈ దారుణం రాజస్థాన్‌లోని అజ్‌మేర్ నగర శివారులోని అన్నాసాగర్ సరస్సు వద్ద చోటుచేసుకుంది. బుధవారం ఉదయం అన్నాసాగర్ సరస్సులో ఓ బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్రిస్టియన్ గంజ్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, పాపను పడేసింది ఆమె కన్నతల్లి అంజలీ సింగ్‌గా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు మరింత భయంకరంగా ఉన్నాయి. తన భర్తను వదిలేసిన అంజలి, ఓ రెస్టారెంట్‌లో పనిచేసే అఖిలేష్ అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. వీరిద్దరి బంధానికి కుమార్తె అడ్డుగా ఉందని ప్రియుడు అఖిలేష్ చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంజలి ఒప్పుకుంది. సంఘటన జరిగిన రోజు రాత్రి, అంజలి తన కుమార్తె వేలు పట్టుకొని సరస్సు చుట్టూ తిప్పుతూ మాట్లాడింది. ఆ చిన్నారి నిద్రలోకి జారుకున్న తర్వాత ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.