Dowry : కట్నం వేధింపులతో కూతురు మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె..

Update: 2025-09-12 09:15 GMT

నవమాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు చావును ఆ తల్లి తట్టుకోలేకపోయింది. విగత జీవిలా పడి ఉన్న కూతురుని చూసిన ఆ తల్లి గుండె ముక్కలైంది. తన బంగారు బొమ్మ ఈ లోకంలో లేదని తెలిసిన ఆ తల్లి కూడా ప్రాణాలు విడిచింది. గంటల వ్యవధిలోనే తల్లీ కూతుళ్ళు చనిపోవడంతో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.

వివరాల్లోకి వెళ్తే, భాగల్‌పూర్ కు చెందిన సునైనా దేవికి కొంతకాలంగా అత్తింటివారితో గొడవలు జరుగుతున్నాయి. ఆమె భర్తకు ఉద్యోగం లేకపోవడంతో అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తింటివారు ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో సునయన అనుమాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసం అత్తింటి వారే ఆమె గొంతు నులిమి చంపేశారని సునైనా పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.

అయితే కూతురి మరణవార్త తెలుసుకున్న సునైనా తల్లి బబ్లీ దేవి, తన బంధువులతో కలిసి భాగల్‌పూర్‌లోని జేఎల్‌ఎన్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ కుమార్తె మృత దేహాన్ని చూసిన బబ్లీ దేవి తట్టుకోలేకపోయింది. గట్టిగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. వైద్యులు ఆమెను పరీక్షించగా, తీవ్రమైన షాక్ కారణంగా బ్రెయిన్ హెమరేజ్ జరిగిందని, దానివల్లే మరణించిందని నిర్ధారించారు. ఒకే ఆసుపత్రిలో తల్లి కూతుళ్ల మృతదేహాలను చూసిన వారి కుటుంబ సభ్యులు గుండెలవేసల రోదించడం అందరిని కంట తడి పెట్టించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News