Crime : గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి.. నందిగామలో విషాదం...

Update: 2025-09-16 07:50 GMT

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నందిగామలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న మాగం నాగమణి (18) అనే విద్యార్థిని గుండెపోటుతో అకాల మరణం చెందింది. కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

అనాసాగరం గ్రామానికి చెందిన నాగమణి నందిగామలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అందరితో కలిసి ఉంటూ...చదువులో ముందు ఉండే నాగమణి...నిన్న సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలోనే నాగమణి అకస్మాత్తుగా రోడ్డుపై కుప్పకూలిపోయింది.

దీంతోవెంటనే స్పందించిన ఆమె స్నేహితులు నాగమణిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. 18 ఏళ్ల యువతి ఇలా గుండె పోటుతో మరణించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, అధ్యాపకులు షాక్ కు గురయ్యారు. ఉదయం కళాశాలకు వచ్చే ముందు ఆమె గ్యాస్ సమస్యగా ఉందని చెప్పి ఒక మాత్ర వేసుకుందని, ఆ తర్వాత అందరితో ఎంతో ఉత్సాహంగా గడిపిందని వారు తెలిపారు. అంతలోనే ఇలా జరగడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉన్నత భవిష్యత్తు ఉన్న ఒక యువతి ఇంత చిన్న వయసులో గుండెపోటుతో మరణించడం స్థానికంగా అందరినీ కలిచివేసింది.

Tags:    

Similar News