Delhi: పోలీస్ కారు ఢీకొని టీ స్టాల్ విక్రేత మృతి.. పోలీసులు మద్యం సేవించారని స్థానికుల ఆరోపణ
రామకృష్ణ ఆశ్రమం మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసుల PCR వ్యాన్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
గురువారం ఉదయం నగరంలోని గోల్ మార్కెట్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసు వాహనం ఢీకొనడంతో టీ స్టాల్ విక్రేత మృతి చెందాడని అధికారులు తెలిపారు. వాహనంలో ఉన్న పోలీసులు మద్యం తాగి ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బాధితుడిని గంగా రామ్ తివారీగా గుర్తించారు. ఆయన 50 ఏళ్ల వయసున్న శారీరక వికలాంగుడు. గత దశాబ్ద కాలంగా రామ కృష్ణ ఆశ్రమ మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక చెట్టు కింద టీ స్టాల్ నడుపుతున్నాడు. ఆయన తన స్టాల్‌లో నిద్రపోతున్నప్పుడు పోలీసు కంట్రోల్ రూమ్ (PCR) వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న ర్యాంప్‌పైకి ఎక్కి అతడిని గుద్దేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పిసిఆర్ వ్యాన్ డ్రైవర్ ప్రమాదవశాత్తూ యాక్సిలరేటర్ నొక్కి రోడ్డు పక్కన ఉన్న ర్యాంప్ పైకి ఎక్కాడని, దీంతో వాహనం ఆ వ్యక్తిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
తివారీ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. ప్రమాదం జరిగినప్పుడు పోలీసు సిబ్బంది మద్యం మత్తులో కనిపించారని ప్రత్యక్ష సాక్షి పండిట్ బాబు తివారీ ఆరోపించారు. PCR వ్యాన్ మరియు సమీపంలోని పోలీసు గదిలో మద్యం సీసాలు దొరికాయని స్థానికులు పేర్కొన్నారు.
ఈ సంఘటనకు కారణమైన ఇద్దరు పోలీసు సిబ్బంది - అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు. ఇది దురదృష్టకరం. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. మృతుడి కుటుంబానికి మేము అన్ని విధాలుగా సహాయం చేస్తాము, పరిహారం అందిస్తాము" అని డిసి హుక్మారామ్ తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.