Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమేనని తేల్చిన సిర్పూర్కర్ కమిషన్..
Disha Encounter: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.;
Disha Encounter: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. హైపవర్ కమిషన్ నివేదికపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసింది. ఈ విచారణకు అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ హాజరయ్యారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది.
చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం వెల్లడించింది. కమిషన్ రిపోర్టు తమకు అందిందని, నివేదికను బహిర్గతం చేస్తామని తెలిపింది. దోషులు ఎవరన్నది కమిషన్ గుర్తించిందని, సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఎన్‌కౌంటర్ ఘటన నివేదిక ద్వారా దోషులెవరో తేలిపోవడం, సుప్రీం కోర్టు ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయడంతో ఘటనలో పాల్గొన్న పోలీసుల్లో టెన్షన్ నెలకొంది.
అటు దిశ కేసులో ఫేక్ ఎన్‌కౌంటర్ అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది. 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన్ నివేదికను తయారు చేసింది. పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్ పేర్కొంది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే ఎన్‌కౌంటర్ జరిగిందని సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని.. వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. నివేదికలో సిర్పూర్కర్ కమిషన్ 16 సిఫార్సులు చేసింది. సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని పేర్కొంది. ఇవి మూక దాడులు లాంటివేనని స్పష్టం చేసింది.
2019 డిసెంబర్ 6న చటాన్‌పల్లి వద్ద 'దిశ'హత్య కేసులో నిందితులు విచారణ సమయంలోనే ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అయితే బూటకపు ఎన్‌కౌంటర్‌తో నిందితులను చంపేశారంటూ ప్రజాసంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం..సిర్పూర్కర్ కమిషన్ ద్వారా పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. వివిధ కోణాల్లో విచారణ జరిపి పూర్తి నివేదికను సుప్రీం కోర్టులో సమర్పించారు.