Hyderabad : క్యాబ్ లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో డ్రైవర్ అరెస్ట్.. ఇద్దరి కోసం గాలింపు
హైదరాబాద్ నగరంలో మరో అఘాయిత్యం జరిగింది. స్వదేశానికి వెళ్లేందుకు బయలుదేరిన జర్మనీ యువతికి లిఫ్ట్ ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్, మరో ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జర్మనీకి చెందిన ఓ యువతి శుభకార్యానికి హాజరయ్యేందుకు మార్చి 4న నగరానికి వచ్చింది. అప్పటి నుంచి నగరంలోనే ఉన్న యువతి.. మార్చి 31న జర్మనీ వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అదే రోజు రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని మండమల్లమ్మ క్రాస్ రోడ్ క్యాబ్ కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఓ క్యాబ్ డ్రైవర్ ఎయిర్ పోర్ట్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో యువతిని ఎక్కించుకున్నాడు. అప్పటికే కారులో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎయిర్ పోర్టుకు వెళ్లేదారిలో మధ్యలో కారు నిలిపి వేసి యువతిపై ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిని అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు. బాధితురాలు స్థానికుల సహాయంతో పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో నమోదైన విజువల్స్ ద్వారా క్యాబ్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.