హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టయ్యింది. మేడ్చల్ జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో 12 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీకి వాడే 32 వేల లీటర్ల రా మెటీరియల్ కూడా లభ్యమవ్వగా.. వాటిని సీజ్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన మహిళ అరెస్ట్ అవ్వడంతో ఈ డ్రగ్స్ గుట్టు బయటపడగా.. మేడ్చల్‌లో 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి పెద్దఎత్తున డ్రగ్స్ తయారీ అవుతుండగా.. వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు.ఎండీ, ఎక్స్టాసీ, మోలీ, ఎక్స్‌టీసీ పేర్లతో డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తయారు చేసేందుకు కావలసిన కాంపోనెంట్స్ భారీగా లభ్యమయ్యాయన్నారు. డ్రగ్స్ తయారీ చేస్తున్న కంపెనీని పోలీసులు సీజ్ చేశారు. విదేశీయుడి నుంచి రూ.25 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్‌లో క్రైమ్ బ్రాంచ్ దాడులు చేసింది. వెయ్యి కిలోల కెమికల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సప్లయర్లు, మాన్యుఫాక్చరర్లు , డిస్ట్రిబ్యూటర్లు కలిసిన భారీ నెట్వర్క్ని మహారాష్ట్ర పోలీసులు చేధించారు.