Crime : ఔటర్‌పై ఘోర ప్రమాదం.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి.. ఏడుగురికి గాయాలు
దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక యువతి మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలిజగూడ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న రాళ్లకత్వా సౌమ్య రెడ్డి (25) తన సహోద్యోగులు వీరేంద్ర (26), నంద కిషోర్, ప్రణీష్, సాగర్, అరవింద్, జాన్సీ, శృతిలతో కలిసి రాచకొండలోని సరళ మైసమ్మ తల్లి ఆలయానికి ఇన్నోవా క్రిస్టా కారులో వెళ్లారు. ఆదివారం సెలవు కావడంతో వీరంతా కలిసి ఈ యాత్రకు వెళ్ళారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా, రాత్రి 7.30 గంటల సమయంలో బలిజగూడ గ్రామం వద్ద .. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్ డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హయత్ నగర్‌లోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన సౌమ్య రెడ్డి, నంద కిషోర్ లను మెరుగైన చికిత్స కోసం ఉప్పల్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించగా...అక్కడ చికిత్స పొందుతూ సౌమ్య రెడ్డి మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.