Murder Case : కాళ్లు , చేతులు లేకుండానే అంత్యక్రియలు.. మేడిపల్లి హత్య కేసులో ఘోరం..
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన స్వాతి కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. భర్త మహేందర్ రెడ్డి గర్భవతి అయిన తన భార్య స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను మూసీ నదిలో పడేశాడు. ఈ కేసులో పోలీసులు ఎంత వెతికినా స్వాతి మొండెం మాత్రమే లభ్యం అయింది. వర్షాల ప్రభావంతో మూసీ నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. సుమారు 10 కిలో మీటర్ల వరకు గాలించినా ఫలితం దక్కలేద . దీంతో కేవలం మొండానికే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
కాగా సోమవారం రాత్రి స్వాతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం కామారెడ్డిగూడకు తరలించారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. శరీరం పూర్తి భాగం లభ్యం కాకపోవడంతో కేవలం మొండానికే అంత్యక్రియలు జరిపించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామస్థులంతా మహేందర్ రెడ్డిపై, అతని కుటుంబ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను గ్రామంలోకి అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు.