దంపతుల మధ్య పిల్లలు కనే విషయమై తలెత్తిన గొడవల కారణంగా ఓ ఐటీ ఎంప్లాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం ఏఎస్ఐ రాంభూపాల్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఏపీలోని చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం చొక్కమడుగు గ్రామానికి చెందిన గోలి అశ్విన్ కుమార్ రెడ్డి(36)కి, శ్రావ్యకు గత నవంబర్ లో పెండ్లి అయింది. దంపతులు సిటీకి వచ్చి గచ్చిబౌలి టెలికం నగర్ లో ఉంటూ ఐటీ జాబ్ లు చేస్తున్నారు.
కొద్ది రోజులుగా దంపతుల మధ్య పిల్లల విషయమై మనస్పర్థలు వచ్చాయి. రెండు రోజుల కిందట ఇద్దరూ గొడవ పడ్డారు. బుధవారం మధ్యాహ్నం శ్రావ్య ఆఫీసుకు వెళ్లగా.. అశ్విన్ ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శ్రావ్యకు మామ మురళీధర్ రెడ్డి ఫోన్ చేసి అశ్విన్ ఫోన్ ఎత్తడం లేదని చెప్పాడు.
దీంతో వెంటనే ఇంటికి వెళ్లిన శ్రావ్య తలుపులు కొట్టగా అశ్విన్ తీయడం లేదు. తన వద్ద ఉన్న మరో తాళం చెవితో తలుపు తీసి.. లోపలికి వెళ్లి చూడగా.. అశ్విన్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడు. ఆమె వెంటనే భర్తను స్థానికుల సాయంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిన్టటు డాక్టర్లు నిర్ధారించారు. రాయదుర్గం పోలీసులు వెళ్లి అశ్విన్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.