Viral : తాళ్లతో చేతులు కట్టేసి కొడుతూ భార్యను హింసించిన భర్త.. ప్రకాశం జిల్లాలో దారుణం
ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. భార్యను దారుణంగా హింసించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జరిగింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురునాథ్ బాలాజీ అనే వ్యక్తికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అతను చీరాలకు వలస వెళ్లి అక్కడ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు సొంతూరుకు వచ్చి భార్యను బెదిరించి ఆమె దగ్గర ఉన్న డబ్బు తీసుకు వెళ్ళేవాడు.
శనివారం సాయంత్రం గురునాథ్ తన మేనల్లుడు, ప్రియురాలితో కలిసి గ్రామానికి వచ్చాడు. తన భార్యను జగనన్న కాలనీలోని ఒక ఇంటికి తీసుకెళ్లి, ఆమె రెండు చేతులు కట్టివేసి విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు అక్కడ నుంచి తప్పించుకుని, స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించింది. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయారు.
ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీయగా, మంగళవారం అది వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు.. మాట్లాడుతూ, బాధితురాలి నుంచి తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.