గులాబీ బాస్ రంగంలోకి దిగే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రాష్టంలో పూర్తిస్థాయి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన పోరాటం చేయబోతున్నారని, నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సభలు లేదా కార్నర్ మీటింగ్‌లు పెట్టి.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని.. ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ తప్పిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు.. ఆ కార్యాచరణకు సంబంధించి పూర్తి వివరాలు షెడ్యూల్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.. సెప్టెంబర్ మొదటి వారంలోనే.. గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖాన్ని పూరించనున్నట్టు సమాచారం వినిపిస్తోంది. కాగా.. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేలు హరీశ్ రావు, కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత విడుదలతో.. పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా గులాబీ బాస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.