జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఈ నెల 20న మహిళను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం, తన భార్యతో గొడవల కారణంగానే మహిళ హత్య జరిగినట్లు డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మెట్‌పల్లి సీఐ ఆఫీస్‌లో డీఎస్పీ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మెట్‌పల్లికి చెందిన సంగం గంగాధర్‌కు మమతతో 16 ఏళ్ల కింద పెండ్లి అయింది. గంగాధర్ పదేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. అప్పటి నుంచి మమత షేక్ అప్సర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం మమత భర్త గంగాధర్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయినా మమత పద్దతి మార్చుకోకపోవడంతో గంగాధర్ నాలుగేళ్ల క్రితం విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి మమత అప్సర్‌తోనే ఉంటోంది. ఈ విషయం అప్సర్ కుటుంబ సభ్యులు, భార్యకు తెలియడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. అప్సర్, అతడి భార్యకు రోజూ గొడవలు జరుగుతుండడంతో మమతను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇందులో భాగంగా ఈ నెల 20న మమత ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. దీంతో అప్సర్ చున్నీతో పాటు కేబుల్ వైర్ తీసుకొని మమత మెడకు చుట్టి గొంతునులమడంతో పాటు కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ మమత స్పాట్‌లోనే చనిపోయింది. మృతురాలి కొడుకు గ్రహీత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. గురువారం కొత్తబస్టాండ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు అప్సర్ కనిపించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ వఎంట సీఐ నవీన్, ఎస్సై చిరంజీవి ఉన్నారు.