PUNE RAPE CASE : డెలివరీ ఏజెంట్‌గా నమ్మించి, యువతిపై అత్యాచారం

Update: 2025-07-03 09:25 GMT

పూణెలోని కొంధ్వా ప్రాంతంలో బుధవారం సాయంత్రం 7:30 గంటల సమయంలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన ఒక దుండగుడు, 22 ఏళ్ల ఐటీ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలు తన సోదరుడితో కలిసి కొంధ్వాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది, బుధవారం సాయంత్రం ఆమె సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో, డెలివరీ ఏజెంట్ అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. ఒక పత్రంపై సంతకం చేయాలని కోరగా, బాధితురాలు పెన్ను తీసుకురావడానికి లోపలికి వెళ్లినప్పుడు, అతను బలవంతంగా ఇంట్లోకి చొరబడి తలుపు గడియపెట్టాడు.

అనంతరం, నిందితుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘాతుకానికి పాల్పడటమే కాకుండా, బాధితురాలి ఫోన్‌లోనే ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. అంతేకాకుండా, "నేను మళ్ళీ వస్తాను" అని బెదిరింపు సందేశాన్ని కూడా ఆమె ఫోన్‌లో వదిలి వెళ్ళాడు.

బాధితురాలు తేరుకున్న తర్వాత, తన బంధువులకు సమాచారం అందించగా, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బాధితురాలిని స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదైనా రసాయనాన్ని ఉపయోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం), 77 (ఓయూరిజం), మరియు 351(2) (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి పూణె క్రైమ్ బ్రాంచ్‌తో సహా మొత్తం 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడి ముఖం రికార్డయింది. దాని ఆధారంగా, పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఈ సంఘటన పూణె నగరంలో తీవ్ర కలకలం రేపింది ఆన్‌లైన్ డెలివరీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News