MURDER: ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగలెట్టేసింది
ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అభ్యర్థి హత్య... దారుణంగా హత్య చేసిన ప్రియురాలు...శవంపై నూనె,నెయ్యి, వైన్ చల్లి గ్యాస్ లీక్
ఈ నెల మొదటి వారంలో దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతోన్న యువకుడు అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో విసుపొయే వాస్తవాలు బయటపడ్డాయి. దీని వెనుక భయానక కుట్రను పోలీసులు వెలికితీశారు. అతడితో సహజీవనం చేస్తోన్న యువతి.. తన మాజీ ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్యచేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. తన వ్యక్తిగత వీడియోలను డిలీట్ చేయడానికి నిరాకరించడంతో మాజీ ప్రియుడి సాయం తీసుకుని ఘాతుకానికి పాల్పడింది. ఆమె, మాజీ ప్రియుడు, వారి స్నేహితుడు కలిసి గొంతు నులిమి చంపేసి, నెయ్యి, వైన్ పోసి శవాన్ని తగులబెట్టారు. అతడు అగ్నిప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు మృతదేహంపై నెయ్యి, నూనె, వైన్ చల్లి.. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ చేసి పేలుడు జరిగేలా చేసినట్లు వెల్లడైంది. ఈనెల 6న తిమార్పుర్లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. అక్కడి ఓ ఫ్లాట్లో కాలిపోయిన మృతదేహం కనిపించింది. మృతుడిని రామ్కేశ్ మీనా(32)గా గుర్తించారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి భవనం లోపలకు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. కాసేపటి తర్వాత వారితో పాటు ఓ యువతి కూడా బయటకొచ్చింది. వీరు వెళ్లిపోయిన కాసేపటికే భవనంలో పేలుడు జరిగింది. ఆ యువతిని ఫోరెన్సిక్ సైన్సెస్ విద్యార్థిని అమృతా చౌహాన్(21)గా గుర్తించారు.
అమృత ప్రైవేటు వీడియోలను రామ్కేశ్ రికార్డు చేశాడని, వాటిని డిలీట్ చేసేందుకు అంగీకరించకపోవడంతో అమృత తన మాజీ ప్రియుడు, మరో స్నేహితుడితో కలసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై మీనా కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో ముందు రోజు రాత్రి ముఖాలను మాస్క్లు ధరించిన ఇద్దరు అక్కడకు రాగా.. కొద్దిసేపటికే ఒకరు బయటకు వెళ్లినట్లు రికార్డయ్యింది. ఆ తర్వాత ఒక యువకుడు, ఒక మహిళ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమెను రామ్ కేశ్ లివ్-ఇన్ పార్ట్నర్ అమృత చౌహాన్గా గుర్తించారు. వారు వెళ్లిన కొద్ది సేపటికి మంటలు చెలరేగినట్టు సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టింది. అలాగే, ఆ సమయానికి అమృత ఫోన్ రామ్ కేశ్ ఫ్లాట్ సమీపంలో ఉన్నట్లు కాల్ రికార్డులు ధ్రువీకరించాయి. దాంతో పోలీసులు హత్యగా అనుమానించి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఘటన తర్వాత అమృత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఆమె కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు అక్టోబర్ 18న పట్టుకున్నారు.