Telangana : 40 పెద్ద సినిమాల పైరసీ.. రూ. 3,700 కోట్ల నష్టం

Update: 2025-07-04 11:15 GMT

టాలీవుడ్ ను పరేషాన్ చేస్తున్న భారీ పైరసీ ముఠా గుట్టును సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 సినిమాలను పైరసీ చేసి వాటిని హెల్దీ వీడియోల ఫార్మాట్ లోకి మార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని పలు వెబ్సైట్ లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లింది. కిరణ్ కుమార్ హైదరాబాద్లోని సినిమా థియేటర్లలో కామ్కార్డ్ ద్వారా సినిమాలను రికార్డు చేసి, హెచ్డ్ ప్రింట్ రూపంలో పైరసీ మాఫియా గ్రూపులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఒక్కో సినిమాకు 400 క్రిప్టో కరెన్సీ లేదా బిట్కాయిన్ల రూపంలో చెల్లింపులు తీసుకునేవాడు. ఈ డబ్బులను జూ పే వంటి ప్లాట్ ఫారమ్ల ద్వారా భారతీయ కరెన్సీగా మార్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ చేంజర్, రాజధాని వంటి సినిమాల ఫైల్ను కిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 65 సినిమాలను ఇప్పటివరకు రికార్డు చేసినట్లు నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. సినిమా థియేటర్లలోనే రికార్డింగ్ చేసి, వాటిని పైరసీ మాఫియాకు అమ్మడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించాడు. ఈ అరెస్టుతో పైరసీ నెట్ వర్క్ పై మరింత లోతైన విచారణ జరుగుతోంది.

Tags:    

Similar News