ఆస్తి కసం కన్నతండ్రి ప్రాణం తీశాడు ఓ కసాయి కొడుకు. వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన కొడుకే గొంతు నులిమి హత్య చేశాడు. భూమి కోసం తనకు దారి చూపించిన తండ్రి పైనే దారుణానికి వడగట్టాడు. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. తాడికొండ కు చెందిన వేల్పూరి శివయ్య (57) పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం పొనుగోటివారిపాలెంలో ఓ కోళ్లఫారంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్యతో పాటు కుమారుడు నరేంద్ర, కుమార్తె ఉన్నారు. నరేంద్ర వివాహం తరువాత కుటుంబం లో విభేదాలు రావడంతో శివయ్య తన భార్యతో కలిసి వేరుగా ఉంటున్నాడు.
కాగా శివయ్య పేరు మీద 1.40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కోసం గత కొంతకాలంగా కుమారుడు నరేంద్ర ఒత్తిడి చేస్తున్నాడు. భూమి తన పేరు మీద పట్టా చేయాలని తండ్రి శివయ్య మీద పలుమార్లు గొడవకు దిగాడు కొడుకు. ఈ క్రమంలో జూలై 9 రాత్రి గ్రామానికి వచ్చిన శివయ్య కు , కొడుకు నరేంద్ర కు ఆస్తి విషయం లో వాదన జరిగింది."ఆస్తి రాసివ్వకపోతే చంపేస్తా" అని నరేంద్ర బెదిరించినట్టు తెలిసింది.
అదే రోజు రాత్రి శివయ్య నిద్ర పోతున్న సమయం లో నరేంద్ర గొంతు నులిమి చంపాడు.ఐతే కుటుంబ సభ్యులు నిద్రలోనే చనిపోయినట్లుగా భావించారు. కానీ శివయ్య మృతిపై ఆయన భార్య అంజమ్మ కు అనుమానం రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నరేంద్రను విచారించగా.. అతడు హత్య చేసినట్లు గా అంగీకరించాడు. ప్రస్తుతం నరేంద్ర కు కోర్టు రిమాండ్ విధించినట్టు సీఐ వాసు తెలిపారు.