హనుమకొండలోని నైమ్‌నగర్‌లో ఉన్న తేజస్వి హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్న పోలేపల్లి జయంతి వర్ధన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. తరగతి గదిలోనే అతడి ముక్కు, చెవుల నుంచి రక్తం రావడాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యలోనే జయంతి వర్ధన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని జయంతి వర్ధన్ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, పాఠశాలలో ఏమైందనే దానిపై స్పష్టత కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.