Tamilnadu : మేకప్ తో బురిడి కొట్టించిన మాయలేడి
Tamilnadu: మేకప్‌తో మాయ చేసింది. లేత వయస్సును ఆపాదించుకుంది. పెళ్లి చూపుల్లో వరుడిని బుట్టలో వేసుకుంది.
Tamilnadu: మేకప్‌తో మాయ చేసింది. లేత వయస్సును ఆపాదించుకుంది. పెళ్లి చూపుల్లో వరుడిని బుట్టలో వేసుకుంది. ఆమె అందానికి ఫిదా అయిన వరుడు.... ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె వయస్సు 54 ఏళ్లని అవాక్కయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
తమిళనాడు తిరువళ్లురు జిల్లా పుదుపేటలో ఇంద్రాణితో పాటు ఆమె కుమారుడు హరి నివసిస్తున్నారు. కుమారుడు హరికి 30 ఏళ్ల వయస్సు. అప్పటికే అతడికి పెళ్లయి విడాకులు కూడా తీసుకున్నాడు. అతను మళ్లీ పెళ్లి మళ్లీ పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడని శరణ్య అనే కిలాడీ తెలుసుకుంది..... పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇంద్రాణికి పరిచయమైంది. ఎలాగోలా హరితో పెళ్లికి ఒప్పించింది.
పెళ్లి చూపులకు వస్తున్నారని తెలిసిన శరణ్య...... బ్యూటీపార్లర్‌కు వెళ్లి 35 ఏళ్ల మహిళలా కనిపించేలా మేకప్ చేయించుకుంది. పెళ్లి చూపుల్లో శరణ్యను చూసిన ఫిదా అయిపోయాడు హరి. అందుకే ఆమె వయసు 35 ఏళ్లని చెప్పినా.... శరణ్యతో పెళ్లికి సిద్ధపడ్డాడు. అంతేకాదు 25 సవర్ల బంగారం ఎదురు కట్నం ఇచ్చి మరి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లైన కొద్ది రోజులకే శరణ్య అసలు రూపం బయటపడింది. అత్త, భర్తకు చుక్కలు చూపించింది. ఆస్తి తన పేరు మీద రాయాలని, బీరువా తాళాలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అత్తను ఇంటి నుంచి బయటకు గెంటేసింది. శరణ్య అరాచకాలకు ఫల్‌స్టాప్ పెట్టాలనుకున్న భర్త హరి...... ఆస్తి రాయాలంటే ఆధార్ కార్డ్ కావాలని అడిగాడు. దీంతో శరణ్య అసలు రహస్యం బయటపడింది. ఆధార్ కార్డులో కేరాఫ్ రవి అని ఉండడాన్ని చూసి కంగు తిన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులే అవాక్కయ్యారు.
శరణ్య పెద్ద కిలాడి అని... అంతకుముందే రవి అనే అతన్ని పెళ్లి చేసుకుందని.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారి కూడా పెళ్లిళ్లైనట్లు విచారణలో తేలింది. శరణ్య అసలు పేరు సుకన్య అని... రవితో గొడవల కారణంగా విడిపోయి తల్లితో కలిసి ఉంటోందని తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిత్య పెళ్లికూతురి అవతారం ఎత్తిందంటున్నారు పోలీసులు.
హరితో పెళ్లికి ముందు.... పుత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే మరో వ్యక్తిని కూడా వివాహం చేసుకుంది సుకన్య. తల్లి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో సుబ్రహ్మణ్యం పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తర్వాత పుత్తూరు కు వచ్చిన శరణ్య అలియాస్ సుకన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.