బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తారల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే 25 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 20 మందిపై విచారణ కొనసాగు తోంది. పలువురు నిందితుల నుంచి పోలీసులు స్టేట్ మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఇదిలా ఉండగా యాంకర్ శ్యామల తనపై నమోదైన ఎఫ్ఎస్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలువురు నటీ నటుల స్టేట్ మెంట్లు రికార్డులు చేశారు. కేసులు నమోదైన వారిలో ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళల తదితరులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు ప్రముఖులు తమ వైఖరిని ప్రకటించారు. నటుడు విజయ్ దేవరకొండ తన ప్రచారం ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమస్ కు మాత్రమే పరిమితమని పేర్కొనగా, రానా దగ్గుబాటి కూడా తాను నైపుణ్య ఆధారిత గేమ్లను మాత్రమే ప్రమోట్ చేశానని స్పష్టం చేశాడు. మరోవైపు ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వీడియోను పోస్ట్ చేసి, 2016 లో మాత్రమే ఈ యాప్లకు ప్రచారం చేశాను. కానీ, ఆ తర్వాత అవి తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని గుర్తించి 2017 నుంచి పూర్తిగా ప్రమోట్ చేయడం మానేశాను అని వివరించాడు.
రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది ఆత్మహత్య
బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆర్థికంగా నష్టపోయి తెలంగాణలో 15 మంది ఆత్మ హత్య చేసుకున్నరని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. సినీ తారలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంపై, ప్రజల ఆర్థిక నష్టంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అందులో భాగమైనవారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.