నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో కురిసిన కుండపోత వర్షం పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షానికి పాత ఇంటి గోడ కూలిపోవడంతో నిద్రిస్తున్న తండ్రి, అతని నెలన్నర పసిబిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కోటగిరికి చెందిన 24 ఏళ్ల మహేశ్, తన భార్య, నెలన్నర వయసున్న పాపతో కలిసి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి వారి పాత ఇంటి మట్టి గోడ పూర్తిగా నానిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గోడ కూలి, నిద్రిస్తున్న మహేశ్, అతని పసిబిడ్డపై పడింది. గోడ శిథిలాల కింద చిక్కుకుపోయిన మహేశ్, అతని చిన్నారి కుమార్తె తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మరణించారు. ఈ దుర్ఘటనలో మహేశ్ భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
పెద్ద శబ్దం విని చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న మహేశ్ భార్యను బయటకు తీసి, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న పోలీసుల పరిస్థితిని సమీక్షించారు. తండ్రితో పాటు పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.