Crime : కూకట్‌పల్లిలో విషాదం: తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

Update: 2025-09-17 07:30 GMT

మూడు నెలల క్రితం వివాహమైన యువతి, తల్లి మందలించిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మూసాపేటలోని యాదవబస్తీకి చెందిన రమ్యకు మూడు నెలల క్రితం అశోక్‌ అనే యువకుడితో పెళ్లైంది. ప్రస్తుతం దంపతులు రమ్య పుట్టింట్లోనే ఉంటున్నారు. సోమవారం రమ్య తల్లి తులసమ్మ, రమ్యతో కలిసి మార్కెట్‌కి వెళ్లొచ్చారు. ఆ తర్వాత రమ్య తన సెల్ ఫోన్‌లో మాట్లాడుతుండటం చూసి తులసమ్మ మందలించారు. "ఎప్పుడూ ఫోన్‌తోనే గడపడం సరికాదు, ఇప్పుడు నీకు పెళ్లైంది. సంసార బాధ్యతలు చూసుకోవాలి" అని కుమార్తెకు చెప్పారు.

ఈ మాటలకు తీవ్రంగా మనస్తాపం చెందిన రమ్య, తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి 11:30 గంటల సమయంలో కుటుంబ సభ్యులు చూడగా, ఆమె ఉరి వేసుకుని కనిపించింది. తులసమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి మందలింపుకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది.

Tags:    

Similar News