Amarnath Yatra : కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర.. 21 రోజుల్లో 3.52లక్షల మంది దర్శనం
అమర్‌నాథ్ కొనసాగుతోంది. జులై 3న ఈ యాత్ర ప్రారంభంమవ్వగా.. ఇప్పటివరకు 3.52 లక్షలకు పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి రెండు బేస్ క్యాంపులకు 2896 మంది యాత్రికుల బృందం శుక్రవారం బయలుదేరింది. 790 మంది యాత్రికులతో మొదటి ఎస్కార్ట్ కాన్వాయ్ తెల్లవారుజామున 3:30 గంటలకు బాల్టాల్ బేస్ క్యాంపుకు బయలుదేరింది. ఆ తర్వాత 2,106 మంది యాత్రికులతో రెండవ కాన్వాయ్ తెల్లవారుజామున 4:18 గంటలకు పహల్గామ్ బేస్ క్యాంపుకు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.
ఈసారి అమర్‌నాథ్ యాత్రకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ, స్థానిక పోలీసులకు అదనంగా 180 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను రప్పించారు. ఈ ఏడాది యాత్రికుల సురక్షిత ప్రయాణం కోసం సైన్యం ఏకంగా 8,000 మందికి పైగా ప్రత్యేక కమాండోలను మోహరించింది. యాత్ర జులై 3న ప్రారంభమై 38 రోజుల తర్వాత ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ సందర్భంగా ముగుస్తుంది.