తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండ రామాలయంలో జూలై 16వ తేదీ ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం…
శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శ్రీ పుండరీక వల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షణగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామి వారికి సమర్పించనున్నారు.
శ్రీ కోదండరామాలయంలో….
శ్రీ కోదండరామాలయంలో బుధవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా నూతన వస్త్రాలను విమాన ప్రదక్షణగా తీసుకువచ్చి శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జీయర్ స్వాములు, ఆలయ అధికారులు పాల్గొననున్నారు.