Srivari Kalyanam in Prayagraj : ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి కల్యాణానికి ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో టీటీడీ శ్రీవారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించబోతోంది. ప్రయాగ్ రాజ్ సెక్టార్ - 6లో టీటీడీ చేపడుతున్న రోజువారీ కార్యక్రమాలపై టీటీడీ పరి పాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈవో శ్యామలరావు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3,12 తేదీలలో జరుగనున్న శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉత్తరాది భక్తులు విరివిగా వచ్చే అవకాశం ఉంటుందని భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి 29న మౌణి అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న శివరాత్రి లాంటి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, టీటీడీ విజిలెన్స్ అధికారులు, ప్రయాగ్ రాజ్ పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి నమూనా ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు చేయాలని సూచించారు. శ్రీవారి భక్తులకు ఉచితంగా ఇచ్చే చిన్న లడ్డూలను సమకూర్చుకోవాలన్నారు.