TTD : తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారి అభయ ప్రదానం
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు స్వామివారు పలు వాహన సేవలపై దర్శనమిస్తున్నారు. మంగళవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధుల్లోకి తరలివచ్చారు. గోవిందా నామస్మరణతో మాడవీధులు మారుమోగాయి.
కార్యక్రమాల వివరాలు:
మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారికి ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి శ్రీవారు చంద్రప్రభ వాహనసేవపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా తిరుమలలో భక్త జన సందోహం కొనసాగుతోంది.