Basara : వసంత పంచమి .. బాసరకు పోటెత్తిన భక్తులు

Update: 2024-02-14 05:02 GMT

నేడే వసంత పంచమి కావడంతో బాసరకు భక్తులు పోటెత్తారు. మాఘశుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు భారీ సంఖ్యలోభక్తులు తరలి వచ్చారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు సరిపడే ప్రత్యేక క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సరస్వతీ అమ్మవారి జన్మదినం సందర్భంగా అక్షరభ్యాసం చేస్తే తమ చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఏటా వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 14న వసంత పంచమి జరుపుకుంటున్నారు. ఈరోజు సరస్వతీ దేవిని పూజించడంతో పాటు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. వసంత పంచమి శుభ ముహూర్తం ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2.41 గంటల నుంచే ప్రారంభంఅవుతుంది. ఇది ఫిబవరరీ 14 మధ్యాహ్నం 12.12 గంటల వరకు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు సరస్వతీ దేవిని పూజించేందుకు శుభ సమయం.

బాసర గ్రామం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పరిధిలో ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున సరస్వతీమాత ఆలయం ఉంది. దీనిని మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో వాల్మీకి సమాధి స్థలం కూడా ఉంది. ఆలయంలో లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఆలయంలో సరస్వతీమాత విగ్రహం పద్మాసన భంగిమలో నాలుగు అడుగుల ఎత్తుతో కూడి ఉంటుంది. ఆలయానికి తూర్పున మహంకాళి ఆలయం కూడా ఉంది.

Tags:    

Similar News