ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్ నాథ్ ఆలయం తలుపులు మూతపడ్డాయి. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ తలుపులను మూసివేశారు. మళ్లీ ఆర్నెలల తర్వాతే ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. ఈ ఆర్నెలలు ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. అప్పటి వరకూ ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబాకి ఆరాధన, దర్శనం నిర్వహిస్తారు.
శీతాకాలం ప్రారంభం కావడంతో చార్ ధామ్ ఆలయాలు మూతపడుతున్నాయి. శనివారం గంగోత్రి ధామ్ తలుపులను మూసివేయగా.. ఆదివారం కేదార్ నాథ్ ఆలయం మూతపడింది. అలాగే యమునోత్రి ఆలయ తలుపులను మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేశారు. శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూసివేస్తారు. ఈ ఏడాది మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర తుదిదశకు చేరుకుంది. నవంబర్ 1 వరకూ 15 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. భక్తులు జ్యోతిర్లింగాలను సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ వేసవికాలంలోనే ఆలయాల తలుపులు తెరచుకోనున్నాయి.