ఆగస్టు 8వ తేది వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు అమ్మవారి దర్శనాన్ని సౌకర్యవంతంగా పొందేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయం పరిధిలో ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి సరఫరా, శోభాయమానంగా విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణ, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించబడుతుంది. భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆలయం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎస్‌వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు. అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై మాడ వీధులలో విహరిస్తారు. ఈ శోభాయాత్ర భక్తులను కనువిందు చేయనుంది.అదేవిధంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 51 టీటీడీ స్థానిక ఆలయాల్లో నిర్వహించే ‘సౌభాగ్యం’ కార్యక్రమం ద్వారా మహిళా భక్తులకు అక్షింతలు, పసుపు దారాలు, కుంకుమ, కంకణాలు, శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తకం, గాజులు వంటి పవిత్ర సామగ్రిని పంపిణీ చేయనున్నారు.